తొక్కిసలాట జరిగిందని చెబితే, మన సినిమా హిట్టయినట్టే అన్నాడట... అల్లు అర్జున్ పై అక్బరుద్దీన్ ఫైర్
- అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రసంగం
- అల్లు అర్జున్ పేరెత్తకుండా తీవ్ర విమర్శలు
- తాము కూడా బహిరంగ సభలకు వెళుతుంటామని వెల్లడి
- కానీ తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తపడతామని స్పష్టీకరణ
"నాకున్న సమాచారం మేరకు... ఆ హీరో థియేటర్ కు వచ్చి సినిమా చూస్తుంటే... బయట తొక్కిసలాట జరిగిందని పోలీసు అధికారులు వచ్చి ఆ హీరోకు చెప్పారు. ఒక మహిళ మృతి చెందిందని, ఒక బాలుడు కిందపడిపోయాడని వారు ఆ హీరోకు వివరించారు. దాంతో ఆ హీరో ఆనందంగా... ఇక మన సినిమా హిట్టయినట్టే అన్నాడట.
ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆ పిల్లవాడు తీవ్ర గాయాల పాలయ్యాడు... అయినా గానీ ఆ హీరో థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూనే ఉన్నాడు. థియేటర్ బయటికి వచ్చి కూడా వాహనం పైనుంచి చేయి ఊపుతూ వెళ్లాడంటే ఏమనాలి? ఇది మానవీయ వైఖరేనా?
నేను కూడా బహిరంగ సభలకు హాజరవుతుంటాను... ఆ సభలకు వేలాదిగా ప్రజలు వస్తుంటారు... కానీ ఎక్కడా తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త పడతాను. నా చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్లు ప్రజలను నెట్టివేయకుండా చూసుకుంటాను" అని అక్బరుద్దీన్ వివరించారు.