Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువతకు ఉద్యోగాలే లక్ష్యం...  మంత్రి లోకేశ్ సమక్షంలో సీడాప్ కీలక ఒప్పందాలు

SEEDAP MoUs with three firms
Advertisement
  • మూడు ప్రధాన సంస్థలతో సీడాప్ అవగాహన ఒప్పందాలు
  • నారా లోకేశ్ నివాసంలో కీలక ఒప్పందాలు
  • ఉద్యోగాల కల్పనకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్న లోకేశ్ 
Advertisement
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్) 3 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సీడాప్ చైర్మన్ గునుపాటి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

రాష్ట్రంలో ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్, స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఆదాయం కల్పించడం ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యం. 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో యువతకు రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీడాప్ పెద్దఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు సీడాప్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. 

సీడాప్ చైర్మన్ గునుపాటి దీపక్ రెడ్డి మాట్లాడుతూ... సీడాప్ ఆధ్వర్యాన వివిధరంగాల్లో యువతకు పెద్దఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు.  కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సహకారంతో అమలుచేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డిడియుజికెవై) లక్ష్యానికి అనుగుణంగా ఎంప్లాయ్ మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్, వీసా సపోర్టు కార్యక్రమాలను సీడాప్ అందిస్తోందని చెప్పారు.  

2కామ్స్ ద్వారా యువతకు విదేశీ ఉద్యోగాలు

జర్మనీతోపాటు అంతర్జాతీయంగా డిమాండ్ కలిగిన వృత్తినిపుణులకు ఉద్యోగాలు కల్పించేలా సీడాప్, 2కామ్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. హెల్త్ కేర్ తోపాటు ఇతర రంగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్ అభ్యర్థులకు తాము విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని 2కామ్స్ గ్రూప్ సీఈఓ ప్రశాంత్ పాషియా తెలిపారు. 

తొలివిడతగా రాబోయే రెండేళ్లలో 2000 మంది అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.  ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ ఉద్యోగాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను సీడాప్ నిర్వహిస్తుంది. భాషా శిక్షణ, వీసా ప్రాసెసింగ్, విదేశీ ప్లేస్‌మెంట్ కు అవసరమైన మద్దతు 2coms సంస్థ అందిస్తుంది. 

గ్రామీణ యువత ఉపాధి కోసం  సెంచూరియన్ తో ఒప్పందం

2029నాటికి ఆంధ్రప్రదేశ్ లో 30 వేల ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు 679 మంది డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (డీఆర్ పీ)లకు శిక్షణ ఇచ్చేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సీడాప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. డీఆర్ పీ ఉద్యోగాల కోసం అర్హత కలిగిన నిరుద్యోగ యువతను గుర్తించడం, ఎంపిక చేయడం, శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలను సీడాప్ చేపడుతుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో 18-35 సంవత్సరాల నడుమ వయసు కలిగిన స్కూలు, కళాశాల డ్రాపౌట్స్ ను గుర్తించి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా నెల్లిమర్లలోని కట్ మ్యాప్ (సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, ఆంధ్రప్రదేశ్), సీడాప్ నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. 

స్వయం ఉపాధి-ఆధారిత నైపుణ్య కార్యక్రమాలను అభివృద్ధి చేయడం, దుస్తుల తయారీ, ఆటో విడిభాగాలు, డ్రాగన్ ఫ్రూట్ సాగు, స్మార్ట్ వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాలలో ఎంటర్‌ప్రైజ్ క్లస్టర్‌లను రూపొందించి యువతకు శిక్షణ ఇస్తారు. 
Advertisement
Advertisement
Nara Lokesh
SEEDAP
Jobs
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News