Vinod Kambli: కపిల్‌దేవ్ ఆఫర్‌ను అంగీకరించిన వినోద్ కాంబ్లీ
- అనారోగ్య, ఆర్థిక సమస్యలతో కాంబ్లీ సతమతం
- బీసీసీఐ ప్రతి నెలా ఇచ్చే రూ. 30 వేల పెన్షన్‌తోనే బతుకుతున్నట్టు చెప్పిన కాంబ్లీ
- అతడిని ఆదుకునేందుకు 1983 నాటి క్రికెట్ జట్టు సిద్ధంగా ఉందని ఇటీవల కపిల్ ప్రకటన
- ఈ ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్టు తాజాగా వెల్లడించిన కాంబ్లీ
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ రిహాబిలిటేషన్ (పునరావాసం) ఆఫర్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్‌కాంబ్లీ అంగీకరించాడు. ఆర్థిక కష్టాలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వినోద్ కాంబ్లీని 1983లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు ఆదుకుంటుందని కపిల్ ఇటీవల ప్రకటించాడు. కాంబ్లీ తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే అతడిని తిరిగి సొంతకాళ్లపై నిలబడేలా సాయం అందిస్తామని పేర్కొన్నాడు.
తాజాగా దీనిపై స్పందించిన కాంబ్లీ.. కపిల్ టీం ఆఫర్‌ను ఆహ్వానిస్తున్నట్టు చెప్పాడు. కుటుంబం తన చుట్టూ ఉన్నంత కాలం తనకు ఎలాంటి భయం లేదని చెప్పాడు. కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమాన్ని ఇటీవల ముంబైలో నిర్వహించారు. కాంబ్లీ, సచిన్ సహా పలువురు క్రికెటర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సచిన్ చేతిని పట్టుకున్న కాంబ్లీ విడిచిపెట్టేందుకు నిరాకరించిన వీడియో వైరల్ అయింది. అందులో కాంబ్లీ గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు. అంతకుముందు వైరల్ అయిన ఓ వీడియోలో నడిచేందుకు కూడా అతను ఇబ్బందిపడడం కనిపించింది. తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, బీసీసీఐ నెలకు ఇచ్చే రూ. 30 వేల పెన్షన్‌తో ఇద్దరు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు చెప్పాడు.
కాంబ్లీ ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిపై స్పందించిన కపిల్‌దేవ్.. అతడు అంగీకరిస్తే 1983 నాటి జట్టు అతడిని ఆదుకుంటుందని చెప్పాడు. కపిల్ ఆఫర్‌పై తొలుత సునీల్ గవాస్కర్ స్పందించాడు. కాంబ్లీకి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో కాంబ్లీ మాట్లాడుతూ పునరావాసం అందుకునేందుకు తనకు ఎలాంటి సంశయం లేదని, కుటుంబం తోడున్నంత వరకు ఎవరికీ, దేనికీ భయపడబోనని చెప్పాడు. పునరావాసం పూర్తిచేసుకుని తిరిగి వస్తానని చెప్పుకొచ్చాడు.