Indigo: ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో 24 గంటల నుంచి 400 మంది ఇండిగో ప్రయాణికుల నిరీక్షణ

Around 400 IndiGo passengers have been stranded at Istanbul airport for 24 hours
  • భోజనం, సరైన బస సౌకర్యం లేక పడిగాపులు
  • కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ ప్యాసింజర్ల మండిపాటు
  • న్యాయమైన పరిహారం చెల్లించాలంటూ ఓ ప్రయాణీకుడి డిమాండ్
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో దాదాపు 400 మంది ఇండిగో ప్రయాణికులు చిక్కుకున్నారు. వీళ్లంతా న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రావాల్సి ఉంది. గత 24 గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానం ఆలస్యం అవుతుందని మొదట ప్రకటించారని, ఆ తర్వాత ఎలాంటి ప్రకటనా చేయకుండానే రద్దు చేశారని వాపోతున్నారు.

విమానం ఒక గంటలో రెండు సార్లు వాయిదా పడిందని, ఆపై రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని అనుశ్రీ బన్సాలీ అనే మహిళా ప్యాసింజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా అలసటగా ఉందని, తనకు జ్వరం వచ్చిందని ఆమె వాపోయారు. ప్రయాణికులకు ఎలాంటి వసతి, భోజన సదుపాయాలు కల్పించలేదన్నారు. కనీసం ఇండిగో ప్రతినిధి ఎవరూ తమను సంప్రదించలేదని అనుశ్రీ విచారం వ్యక్తం చేశారు.

చల్లటి వాతావరణంలో చాలా ఇబ్బంది పడుతున్నామని రోహన్ రాజా అనే ప్యాసింజర్ చెప్పాడు. పార్శ్వ మెహతా అనే ప్యాసింజర్ స్పందిస్తూ.. రాత్రి 8.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం రాత్రి 11 గంటలకు వాయిదా పడిందని, ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదాపడినట్టు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ప్రకటన చేయకపోవడం గందరగోళానికి గురిచేస్తోందన్నారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకోవాల్సి వచ్చిందని, క్షమాపణలు చెప్పి న్యాయమైన పరిహారం చెల్లించాలని మెహతా డిమాండ్ చేశారు.

కాగా నిర్వహణ కార్యకలాపాల కారణంగా విమాన సర్వీస్ ఆలస్యమవుతోందని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, క్షమాపణలు కోరుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ఈ మేరకు మోహతా అనే ప్రయాణికుడి సోషల్ మీడియా పోస్టుకు సమాధానం ఇచ్చింది.
Indigo
Istanbul
Turkey
Viral News

More Telugu News