YSR Dist: యువతిపై హత్యాయత్నం కేసు: ప్రేమోన్మాది అరెస్టు

accused was arrested case attempted murder young woman
  • ప్రేమోన్మాదిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ 
  • హైదరాబాద్‌కు పారిపోతుండగా పోలీసులకు చిక్కినట్లు వెల్లడి
  • గ్రామస్తులు కొట్టి చంపుతారన్న భయంతో ఆత్మహత్యాయత్నంకు నిందితుడు ప్రయత్నించాడన్న ఎస్పీ
వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో ఇటీవల తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. కత్తిపోట్లకు గురైన యువతి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడు కుళ్లాయప్పను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రేమోన్నాది కుళ్లాయప్పను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిన్న మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత తనను గ్రామస్తులు కొట్టి చంపుతారనే భయంతో నిందితుడు గ్రామ సమీపంలో గల కొండల్లో ఉండి చనిపోవాలనుకుని కత్తితో చేయి కోసుకున్నాడని, ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళుతుండగా, పోలీసులకు చిక్కాడని తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

యువతి అరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారని ఎస్పీ వివరించారు. గత కొంత కాలంగా ఆ యువతిని ప్రేమించాలంటూ నిందితుడు వేధిస్తున్నాడని, ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయాడన్నారు. 
YSR Dist
Crime News
attempted murder case
young woman

More Telugu News