వొడాఐడియా నుంచి సూపర్ ప్లాన్
- ‘సూపర్ హీరో ప్లాన్’ పరిచయం చేసిన కంపెనీ
- అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత డేటా
- రోజుకు 2జీబీ డేటా వర్తించే ప్లాన్లకు వర్తింపు
ఈ అపరిమిత డేటా ఆఫర్ కోసం రోజుకు 2జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ప్లాన్లలో ఒక దానితో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. రోజువారీ డేటాతో సంబంధం లేకుండానే ఉచిత డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ.365తో ఈ కేటగిరి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.365 ప్లాన్లో 28 రోజులపాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది.
ప్రభుత్వరంగ టెలికం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్లోకి కస్టమర్లు పెద్ద సంఖ్యలో పోర్ట్ అవుతున్న నేపథ్యంలో వొడాఐడియా ఈ ఆఫర్ను ప్రకటించింది. సరసమైన ధరలకే చక్కటి ప్లాన్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్కు ‘సూపర్ హీరో ప్లాన్’ సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. వొడాఐడియా ప్రస్తుతం కూడా ‘సూపర్ హీరో ప్లాన్’ తరహాలో ఉచిత డేటా అందిస్తోంది. అయితే అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే డేటా వినియోగానికి అవకాశం ఉంది. కొత్త ప్లాన్లో అదనంగా 6 గంటల సమయం పెరిగింది.