Pencil Sharpner: విద్యార్థి పెన్సిల్ షార్ప్‌నర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Uttar Pradesh Police solves case of stolen pencil sharpener at school
  • ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో ఘటన
  • స్కూళ్లలో విద్యార్థుల ఫిర్యాదుల కోసం పింక్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు
  • నవంబర్ నెలలో మొత్తం 12 ఫిర్యాదులు
  • అన్నింటినీ పరిష్కరించిన పోలీసులు
స్కూల్‌లో ఓ విద్యార్థి నుంచి చోరీకి గురైన పెన్సిల్ షార్ప్‌నర్‌ కేసును ఛేదించిన పోలీసులపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క చర్యతో విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని పాదుకొల్పారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలోని స్కూళ్లలో పోలీసులు పింక్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమకు ఏవైనా సమస్యలు ఎదురైతే తమ ఫిర్యాదులను ఓ కాగితంపై రాసి ఆ బాక్స్‌లో వేస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. 
 
తాజాగా ఈ బాక్స్‌లను ఓపెన్ చేయగా నవంబర్ నెలకు గాను మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని స్కూలు బస్సుల్లో గొడవలు, తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య పోట్లాటలు వంటి ఫిర్యాదులతోపాటు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పరిష్కరించనందుకు టీచర్లు కొట్టారని ఇద్దరు విద్యార్థులు ఫిర్యాదు చేయగా, క్లాసులో విద్యార్థులు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులు అందాయి. అయితే, ఒక విద్యార్థి మాత్రం తన పెన్సిల్ షార్ప్‌నర్ పోయిందని ఫిర్యాదు చేశాడు. 

విద్యార్థుల ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులను కలిసి వారి సమస్యలను పరిష్కరించారు. విద్యార్థుల మధ్య గొడవలను నివారించేలా మధ్యవర్తిత్వం చేశారు. వారి వాదనలు విని సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. అలాగే, పోయిన షార్ప్‌నర్ వెతికి పట్టుకుని బాధిత బాలుడికి అప్పగించారు.

ఈ విషయాన్ని యూపీ పోలీసులు ఎక్స్ ద్వారా వెల్లడించారు. విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించేలా చేసిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ యూజర్ మాత్రం..  20 ఏళ్ల వారి ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారా? అని ప్రశ్నిస్తూ.. తన సేఫ్టీ పిన్ పోయిందని, అది తుప్పుపట్టి కాస్త మెలితిరిగి ఉందని కొన్ని క్లూలు కూడా ఇచ్చారు. దానిని కూడా వెతికిస్తారా? అని జోక్ చేశారు. 
Pencil Sharpner
Uttar Pradesh
Hardoi
School

More Telugu News