Kannababu: షిప్ లోకి వెళ్లకుండా పవన్ ను ఆపారంటే పైస్థాయి వ్యక్తే అయ్యుండాలి... ఎవరా వ్యక్తి?: కన్నబాబు
- నిన్న కాకినాడ పోర్టును తనిఖీ చేసిన పవన్ కల్యాణ్
- తనను షిప్ లోకి వెళ్లకుండా ఆపారని వెల్లడి
- పవన్ ప్రతిపక్షంలో లేరంటూ కన్నబాబు వ్యాఖ్యలు
- డిప్యూటీ సీఎంను అడ్డుకోవడం ఆశ్చర్యకరమంటూ వెల్లడి
కాకినాడ పోర్టును తనిఖీ చేయకుండా తనను అడ్డుకున్నారని, అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఆయుధాలుగా మారాయి. వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"కాకినాడ పోర్టు తనిఖీకి తాను వస్తానంటే, రావొద్దని ఆపే ప్రయత్నం చేశారని పవన్ అంటున్నారు. పవన్ ఇంకో విషయం కూడా చెప్పారు... నేను షిప్ లోకి వెళతానంటే నన్ను వెళ్లనివ్వలేదు అని చెప్పారు. ఆయనేమీ ప్రతిపక్షంలో లేరు... ఇదేమీ వేరే ప్రభుత్వం కాదు... వారి ప్రభుత్వమే... టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం.
ఇక్కడికి రాకుండా ఒక డిప్యూటీ సీఎంను ఆపింది ఎవరు? షిప్ లోకి వెళతానంటే అనుమతి ఇవ్వంది ఎవరు? సహజంగా డిప్యూటీ సీఎంను ఆపాలంటే, ఆయన కంటే పైస్థాయి వ్యక్తే కదా ఆపాలి. కిందిస్థాయి వాళ్లయితే ఆపలేరు. అది ఎవరై ఉంటారు? పవన్ ను ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు?
కాకినాడ పోర్టులో జరుగుతున్నదానిపై నిగ్గు తేల్చాలని ఆయన వస్తే... అడ్డుకోవడం తప్పు కదా! ఈయన కంటే పైస్థాయి వాళ్లు ఆపి ఉంటారని మనకు అర్థమవుతోంది. ఆ పైస్థాయి వాళ్లు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు.
పవన్ ప్రెస్ మీట్ నేను చూశాను. తనను షిప్ వద్దకు వెళ్లనివ్వలేదని చెప్పారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం తనకేమీ కొత్తకాదని, తాను వెళ్లగలనని చెప్పినా ఆయనను అనుమతించలేదు. పరిశీలనకు వచ్చిన ఒక డిప్యూటీ సీఎంనే ఆపితే, మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?" అంటూ కన్నబాబు ప్రశ్నించారు.