Cyclone Fengal: ఫెంగల్ తుపాను: డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ లను సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu reviews on Cyclone Fengal
  • బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను
  • మరి కొన్ని గంటల్లో తీరం చేరే అవకాశం
  • తుపానుపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష
  • జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీ అధికారులకు దిశానిర్దేశం
  • ఆకస్మిక వరదలు వస్తాయన్న సమాచారం ఉందని వెల్లడి 
  • అన్ని స్థాయుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగల్ తుపాను తీరం దిశగా దూసుకువస్తోంది. ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష చేపట్టారు. సీఎంవో అధికారులు, ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ), జిల్లా కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

మరికొన్ని గంటల్లో తుపాను తీరం చేరనుందని, అన్ని స్థాయుల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవిస్తాయన్న సమాచారం ఉందని, ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. 

సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయత్వం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తుపాను నేపథ్యంలో, ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారని, కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని తెలిపారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో అంచనా వేసి, వచ్చిన సమాచారానికి అనుగుణగా చర్యలు చేపట్టాలన్నారు. 

రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్థాయుల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
Cyclone Fengal
Chandrababu
Andhra Pradesh
TDP-JanaSena-BJP Alliance

More Telugu News