Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, ఇస్కాన్ గురువు అరెస్ట్ మీద స్పందించిన షేక్ హసీనా
- శాంతిభద్రతలు రక్షించడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని విమర్శ
- సనాతన వర్గ ఆధ్యాత్మికవేత్తను విడుదల చేయాలని డిమాండ్
- మత స్వేచ్ఛను కాపాడాలని, అన్ని వర్గాలకు భద్రత కల్పించాలన్న షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడులు, ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు బ్రహ్మచారి అరెస్ట్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను, శాంతిభద్రతలను రక్షించడంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. సనాతన వర్గానికి చెందిన ఆధ్యాత్మికవేత్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును పరోక్షంగా ప్రస్తావించారు.
తాజాగా చిట్టగాంగ్‌లో హిందూ దేవాలయంపై దాడి జరిగిందని, వివిధ ప్రార్థనాలయాలపై దాడులు పెరిగాయని ఆమె ఆరోపించారు. దేశంలో మతస్వేచ్ఛను కాపాడాలని, అన్ని వర్గాల ప్రజల జీవితాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలపై షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారని అవామీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
అవామీ నేతలను చంపేశారని, ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం అరాచక చర్యలను తాను ఖండిస్తున్నట్లు షేక్ హసీనా తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా తన పదవిని వదులుకొని బంగ్లాదేశ్ వీడాల్సిన పరిస్థితులు ఏర్పడిన సంగతి విదితమే.