Hari Hara Veera Mallu: తుది దశకు 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ.. మేక‌ర్స్‌ కీల‌క అప్‌డేట్

Key Update from Makers of Hari Hara Veera Mallu
  • ఈ వారాంతంలో విజయవాడలో తుది షెడ్యూల్ ప్రారంభం  
  • పవన్ కల్యాణ్‌తో పాటు 200 మంది ఆర్టిస్టులతో భారీ సన్నివేశాల చిత్రీకరణ
  • 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుద‌ల‌
ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన, మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది.

'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంద‌ని తెలిపారు. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్న‌ట్లు చెప్పారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ క‌ల్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఇత‌ర‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి పని చేస్తున్నారు. 

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. 

ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Tollywood

More Telugu News