China: కునుకు తీసినందుకు పోయిన ఉద్యోగం.. కోర్టుకెక్కి రూ. 40 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి

China employee gets Rs 40 lakh compensation after being fired
  • చైనాలోని టైజింగ్‌లో ఘటన
  • రెండు దశాబ్దాలుగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఝాంగ్
  • అలసిపోయి డెస్క్‌పైనే కాసేపు కునుకు తీసినందుకు ఇంటికి పంపిన కంపెనీ
  • అతడి కాసేపు నిద్ర వల్ల కంపెనీకి తీవ్ర నష్టం ఏమీ జరగలేదన్న న్యాయస్థానం
  • అకారణంగా తొలగించారంటూ పరిహారం చెల్లించాలని ఆదేశం
విధుల్లో ఉంటూ కునుకు తీసిన ఉద్యోగిని తొలగించిందో కంపెనీ. అదేమైనా ఉద్యోగం తీసివేసేంత పెద్ద తప్పా? అంటూ బాధిత ఉద్యోగి కోర్టు మెట్లు ఎక్కాడు. విచారించిన న్యాయస్థానం అతడి వాదనతో అంగీకరించింది. 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) పరిహారంగా ఇవ్వాలని సదరు కంపెనీని ఆదేశించింది. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్‌లో జరిగిందీ ఘటన.

ఓ కెమికల్ కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఝాంగ్‌కు మంచి పేరుంది. ఇటీవల విధుల్లో ఉండగా అలసిపోయి తన డెస్క్‌పైనే ఓ కునుకు తీశాడు. అది కాస్తా అక్కడున్న సీసీటీవీ కెమెరాకు చిక్కడంతో కంపెనీ హెచ్‌ఆర్ విభాగం తీవ్రంగా పరిగణించింది. విధుల్లో ఉండగా దాదాపు గంటపాటు నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు హెచ్ఆర్ విభాగం నుంచి వచ్చిన నోటీసు చూసి ఝాంగ్ విస్తుపోయాడు. విధుల్లో నిద్రపోవడం అంటే కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందికే వస్తుందని నోటీసుల్లో పేర్కొంది.

ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. నిద్రపోయినందుకు ఇంత దారుణమైన శిక్ష ఉంటుందా? అని వాదించాడు. వాదనల అనంతరం కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అతడి కునుకు వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని పేర్కొంది. కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగించే హక్కు కంపెనీకి ఉంటుందని, కానీ ఇక్కడ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సమర్థించే ఎలాంటి కారణం లేదని పేర్కొంది. విధుల్లో ఉండగా నిద్రపోవడం అతడికి ఇదే తొలిసారని, దీనివల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదని వివరించింది. కాబట్టి ఝాంగ్‌ను అకారణంగా తొలగించినందుకు రూ. 40.78 లక్షల పరిహారం చెల్లించాలని టైజింగ్‌లోని పీపుల్స్ కోర్టు తీర్పు చెప్పింది.
China
Employee
Sleeping At Work
Court
Taixing
Jiangshu

More Telugu News