Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 10 మంది మావోయిస్టుల మృతి!

10 Maoists Killed In Encounter With Security Forces In Chhattisgarh
  • భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్
  • ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశిస్తున్నారనే సమాచారంతో డీఆర్‌జీ ఆపరేషన్
  • ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరణ‌
ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు.

ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భద్రతా దళాలు మూడు ఆటోమేటిక్ తుపాకులు సహా ప‌లు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశిస్తున్నారనే ప‌క్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) ఈ ఆపరేషన్ చేప‌ట్టింది.

కాగా, ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు బస్తర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ పి.సుందర్‌రాజ్ కూడా ధ్రువీకరించారు. అయితే, మృతుల సంఖ్య, స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతం ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయ‌ని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. 

ఇదిలాఉంటే.. గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతెవాడ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో 31 మంది మావోయిస్టులను భద్రతా ద‌ళాలు కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్‌కౌంట‌ర్ స‌మ‌యంలోనూ భద్రతా దళాలు భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
Chhattisgarh
Maoists
Encounter

More Telugu News