YS Jagan: చంద్రబాబులో ఎప్పటికీ మార్పురాదు: వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

Chandrababu charector will not change says ys jagan
  • చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని మండిపాటు
  • అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • మేం చేసిన పనులు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని ఆరోపణ
చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు అమలు చేయలేకనే చంద్రబాబు బడ్జెట్‌ను ఆలస్యం చేశారని విమర్శించారు. బడ్జెట్‌ను ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులను చూపించవలసి ఉంటుందన్నారు.

అప్పుల విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ఎల్లో మీడియా తోడైందని మండిపడ్డారు. కాగ్ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబును బొంకుల బాబు అని ఎందుకు అనకూడదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు దిగిపోయే నాటికే పరిమితికి మించి అప్పులు చేశారని, ఆరోగ్యశ్రీ సహా వివిధ బకాయిలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే, తమ హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయన్నారు.

వైసీపీ అధికంగా అప్పులు చేసిందని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇందులో రెండేళ్లు కరోనా కాలం ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు ఏం చెప్పినా వక్రీకరనే ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని తాము రూ.25 లక్షలకు పెంచామన్నారు. తమ హయాంలో చేసిన పనులను కూడా చంద్రబాబు టీడీపీ హయాంలో చేసినట్లుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కింద తాము ఖర్చు చేసిన రూ.3,762 కోట్లను తమ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ స్కీం కింద ఖర్చు చేసినట్లు చూపించుకున్నారని ఆరోపించారు.
YS Jagan
Chandrababu
Andhra Pradesh
YSRCP

More Telugu News