AR Rahman: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. కారణం ఇదే!

AR Rahman and his wife Saira have decided to separate after years of marriage
  • దశాబ్దాల వివాహ బంధానికి వీడ్కోలు పలికిన రెహమాన్-సైరా బాను
  • ‘భావోద్వేగ గాయం’ కారణంగా విడిపోయారంటూ భార్య తరపున లాయర్ ప్రకటన
  • 1995లో పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లి 
భారత ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెహమాన్, ఆయన భార్య సైరా బాను తమ రెండు దశాబ్దాల వివాహ బంధానికి గుడ్‌బై చెప్పారు. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు సైరా బాను లాయర్ వందనా షా మంగళవారం రాత్రి కీలక ప్రకటన విడుదల చేశారు. ‘భావోద్వేగపూరితమైన గాయం’ కారణంగా విడిపోతున్నారని న్యాయవాది ప్రకటించారు. కాగా ఈ జంట 1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.

ప్రకటనలో ఏముంది?
రెహమాన్, సైరా బాను విడాకులకు సంబంధించి లాయర్ వందనా షా విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక విషయాలు ఉన్నాయి. ‘‘పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని సైరా బాను కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి వైవాహిక బంధానికి తగిలిన ‘భావోద్వేగ గాయం’ ఈ నిర్ణయానికి కారణంగా ఉంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. దంపతుల మధ్య తలెత్తిన ఉద్రిక్తపూర్వక, ఇబ్బందికర పరిస్థితులు అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని ఇరువురూ గుర్తించారు. ఈ పరిస్థితిలో కలిసి ఉండలేమని ఇరువురూ భావించారు. బాధ, ఆవేదనతో సైరా బాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వ్యక్తిగత జీవితంలో అత్యంత సంక్లిష్టమైన దశలో ఉన్నందున జనాలు అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతకు విలువనివ్వాలని ఆమె అభ్యర్థించారు’’ అని లాయర్ వందనా షా వివరించారు.

రెహమాన్ ఏమన్నారంటే..
ఏఆర్‌ రెహమాన్‌ కూడా విడాకులపై స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని అన్నారు. పగిలిన హృదయాలు దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, తిరిగి యథాతథంగా అతుక్కోలేవని రెహమాన్ వ్యాఖ్యానించారు. కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు.

కాగా రెహమాన్‌ దంపతులు 1995లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 29 ఏళ్లు కలిసి జీవించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఖతీజా, రహీమా, అమీన్‌.
AR Rahman
AR Rahman Divorce
Saira Bano
Bollywood
Movie News

More Telugu News