Komatireddy Venkat Reddy: కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్ ఉంది: లగచర్ల ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Koamtireddy Venkat Reddy drags KTR into Attack on Collector issue
  • నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడినట్లు తెలిసిందన్న మంత్రి
  • ఈ ఘటన వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా ఉపేక్షించేది లేదన్న మంత్రి
  • కలెక్టర్ మీద దాడికి పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిక
లగచర్ల ఘటన సమయంలో నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే ఒకరు (పట్నం నరేందర్ రెడ్డి) 42 సార్లు మాట్లాడినట్లుగా తెలిసిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడినట్లు కూడా ఫోన్ రికార్డింగ్ ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు చేయలేదన్నారు. మల్లన్న సాగర్ సహా పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ జరిగినప్పుడు తాము కూడా ఇలాగే అడ్డుకుంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాటలు విని దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ మంత్రి ఆదేశాలతోనే లగచర్లలో ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగిందన్నారు. గతంలో రేసింగ్ ఈవెంట్ నిర్వహించినప్పుడు విదేశీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఆరోపించారు.

కలెక్టర్ వెళ్లింది ప్రజాభిప్రాయ సేకరణ కోసమేని... రైతులు అందరూ కలిసి వద్దంటే అక్కడ పరిశ్రమను పెట్టరని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కాల్ డేటాను, వాట్సాప్ కాల్ సందేశాలను కూపీ లాగుతామన్నారు. ధాన్యం సేకరణపై మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్నారు. వారం రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
Komatireddy Venkat Reddy
Congress
KTR
BRS

More Telugu News