Ponnam Prabhakar: ఆ పదవులు వేరే వాళ్లకు ఇవ్వండి!: కేటీఆర్‌కు మంత్రి పొన్నం సవాల్

Ponnam Prabhakar challenges ktr
  • బీఆర్ఎస్ అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న మంత్రి
  • బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? అని నిలదీత
  • సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదన్న మంత్రి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని, సభలో ప్రతిపక్ష పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని సవాల్ చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆయన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు సర్వేపై అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి రెచ్చగొట్టే రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలకు ప్రభావితం కావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
Ponnam Prabhakar
KTR
Telangana
BRS

More Telugu News