Ambati Rambabu: ఏపీ డీజీపీని కలిసిన వైసీపీ నేతలు

complaint of ycp leaders to ap dgp demand for arrest of tdp social media activists
  • టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు
  • మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపణ 
  • వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్‌  మీడియా యాక్టివిస్టులను తీసుకెళ్తున్న పోలీసులు.. వారి అరెస్టును చూపించకుండా... రోజుల తరబడి వివిధ పోలీస్‌ స్టేషన్లలో తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వైసీపీ నేతల బృందం డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలపై అసభ్యపోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.  

డీజీపీకి వినతి పత్రం అందజేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ .. కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో తప్పక... పోలీసులు శనివారం సుధారాణి దంపతులను గుంటూరు మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరు పరిచారని చెప్పారు. సుధారాణి, ఆమె భర్తను పోలీసులు దారుణంగా కొట్టిన విషయాన్ని మెజిస్ట్రేట్‌ ముందే స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతోనే పోలీసులు వైసీపీ నేతలపై దాడికి దిగుతున్నారని అంబటి మండిపడ్డారు. వీటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ మీద అసభ్యంగా పోస్టులు పెట్టినవారిని తాము సమర్ధించడంలేదన్న అంబటి... ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు ఫైల్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. 'అమ్మకు నిల్... తండ్రికి పుల్', 'విద్య వద్దు.. మద్యం ముద్దు' అంటే కేసులు పెడతారా? అని నిలదీశారు. ఇదే విషయాన్ని డీజీపీకి వివరించామన్నారు. అధికార పార్టీ నేతలపై ఏ పోస్టులు పెట్టారని మీరు అరెస్టు చేశారో... అదే రకంగా జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ, వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు మీద అత్యంత దారుణంగా పోస్టులు పెట్టిన వారిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు కచ్చితంగా పోరాటం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న చంద్రబాబు... ఆడబిడ్డ సుధారాణిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. 
 
మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ ... ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను, తప్పిదాలను వైసీపీ కార్యకర్తలు ఎత్తి చూపిస్తే.. అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అన్నారు. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులనూ వేధించడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ కొంత మంది వైసీపీ  కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాధిత కుటుంబాల తరపున హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు చేశామన్నారు. 
Ambati Rambabu
YSRCP
Adimulapu Suresh
Social Media

More Telugu News