Vijayawada: రైలులో ప్రయాణిస్తూ కిందనున్న బందరు కాల్వలోకి దూకేసిన మహిళ

Woman suddenly jumps into canal from train in Vijayawada
  • విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్న మహిళ
  • కాల్వలో కొట్టుకుపోతూ ఓ చెట్టును ఆసరాగా చేసుకుని రాత్రంతా అలాగే గడిపిన వైనం
  • రక్షించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ రైలులో ప్రయాణిస్తూ కిందనున్న కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ చివరికి ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ ఖాదర్‌వలి భార్య, పిల్లలతో కలిసి నిజాంపట్నంలో ఉంటున్నారు. ఆయన భార్య జిన్నతున్నీసా (47) కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన ఆమె గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపు వెళ్లే రైలెక్కింది.

రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్ పరిసరాలకు చేరుకుంది. అక్కడామె రైలు నుంచి కిందనున్న బందరు కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. 
Vijayawada
Guntur
AP News

More Telugu News