YV Subba Reddy: ఇది నా విజయమో, వైసీపీ విజయమో అనుకోవడంలేదు: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy reacts on Supreme Court verdict on Tirumala laddu row
  • తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు
  • స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశాలు
  • న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును తన విజయమో, వైసీపీ విజయమో అనుకోవడంలేదని స్పష్టం చేశారు. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయం అని పేర్కొన్నారు. స్వతంత్ర సిట్ దర్యాప్తులో వాస్తవాలేంటో తెలుస్తాయని అన్నారు. 

లడ్డూ కల్తీ జరిగిందని తమపైనా, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ పైనా నిందలు మోపారని కూటమి నేతలపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారని, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తులో వెంకటేశ్వరుడి ఆశీస్సులతో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

స్వతంత్ర సిట్ ను వేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పిందని, అందులో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక నిపుణుడు ఈ సిట్ లో సభ్యులుగా ఉంటారని వైవీ వివరించారు. ఇవాళ కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ను బట్టి చూస్తే... సిట్ నివేదికను మళ్లీ సుప్రీంకోర్టుకే సమర్పించాల్సి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. 

ఎన్డీయే కూటమి చేస్తున్న ఆరోపణలు ఎంతో బాధ  కలిగించాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతోంది కాబట్టి, ఈ విషయంపై ఇంతకంటే మాట్లాడలేనని స్పష్టం చేశారు. 

తాను టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో కానీ, తన తర్వాత భూమన హయాంలో కానీ ఏఆర్ ఫుడ్స్ డెయిరీ నెయ్యి సరఫరా జరగలేదని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చాకే ఆ డెయిరీ నుంచి సరఫరా ప్రారంభమై ఉంటుందని తెలిపారు. ఎవరి హయాంలో టెండర్లు వేశారన్నది సిట్ దర్యాప్తులో తేలుతుందని అన్నారు.
YV Subba Reddy
Tirumala Laddu
Supreme Court
TTD
YSRCP
Andhra Pradesh

More Telugu News