Actor Govinda: బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

Actor Govinda suffers bullet injury at home rushed to hospital
  • గోవిందా ఇంట్లో గ‌న్ మిస్‌ఫైర్ కావ‌డంతో ఘ‌ట‌న‌
  • కాలికి గాయ‌మైన‌ట్లు ముంబ‌యి పోలీసుల వెల్ల‌డి
  • ప్ర‌స్తుతం గోవిందా ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్న‌ వైద్యులు
బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు గోవిందా బుల్లెట్ గాయాల‌తో ఆసుప‌త్రిలో చేర‌డం క‌ల‌కలం సృష్టించింది. గోవిందా ఇంట్లో గ‌న్ మిస్‌ఫైర్ కావ‌డంతో ఆయ‌న‌ కాలికి గాయ‌మైన‌ట్లు ముంబ‌యి పోలీసులు వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న్ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం గోవిందా ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. 

ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల ప్రాంతంలో ఆయ‌న‌ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గాయ‌మైంది. ఘటన జరిగిన సమయంలో జుహు ఇంట్లో గోవిందా ఒంటరిగానే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించ‌గా, చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

గోవిందా కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న మేనేజర్ శశి సిన్హా చెప్పారు. ఆయ‌న‌ తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ కింద పడిపోవ‌డంతో దాన్ని అల్మారాలో ఉంచే క్ర‌మంలో అది పేలి బుల్లెట్ గోవిందా కాలికి తగిలిందని వివ‌రించారు. దేవుడి దయ వల్లనే గోవిందా కాలికి గాయమైందని, పెద్దగా ఏమీ కాలేదని చెప్పారు. 

"మాకు కోల్‌కతాలో ఒక ప్రదర్శన కోసం ఉదయం 6 గంటలకు విమానం ఉంది. నేను విమానాశ్రయానికి చేరుకున్నాను. గోవిందా తన నివాసం నుంచి విమానాశ్రయానికి బయలుదేరబోతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది" అని మేనేజర్ తెలిపారు.
Actor Govinda
Bullet Injury
Bollywood

More Telugu News