పిల్లల కోసం నీళ్లు అడిగితే ఇవ్వలేని పరిస్థితి చూశా.. వరదలపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్

AP CM Chandrababu Press Meet
‘మూడు రోజులుగా మంచినీళ్లు లేవు.. పిల్లల కోసం మీరు నీళ్లు పంపించగలరా’ అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా మంచినీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులను కలిశానని చెప్పారు. బాధితులు పెద్ద కోరికలు అడగలేదని, తాగడానికి అది కూడా పిల్లల కోసం మంచినీళ్లు అడిగారని గుర్తుచేసుకున్నారు. వెంటనే అధికారులను పంపించి లక్షలాది వాటర్ బాటిళ్లను సేకరించి పంచామని చెప్పారు. మొత్తంగా కోటికి పైగా వాటర్ బాటిళ్లను పంచామని చెప్పారు.

విజయవాడ వాసులు ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. ఓవైపు ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షం (క్లౌడ్ బరస్ట్), మరోవైపు బుడమేరుకు కనీవినీ ఎరుగని వరద వచ్చిందని చెప్పారు. బుడమేరు గండ్లను పూర్చడానికి అధికార యంత్రాంగం పగలూరాత్రి కష్టపడిందన్నారు. రోజుల తరబడి వరదల్లోనే అధికారులు, మంత్రులతో పాటు తాను కూడా తిరిగానని చెప్పారు. బాధితులకు మనోధైర్యం ఇస్తూ ముందుకు సాగామన్నారు. రోజుల తరబడి తాను కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద సాయంపై పర్యవేక్షణ చేశానన్నారు. డ్రోన్లను, ఫైరింజన్లను, ప్రొక్లెయిన్లను ఉపయోగించి బాధితులను ఆదుకున్నామని చెప్పారు. 

దాతలకు పాదాభివందనాలు..
సీఎం రిలీఫ్ ఫండ్ కు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తొలిసారిగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 400 కోట్ల రూపాయలు విరాళం అందిందన్నారు. వరద బాధితుల పరిస్థితి చూసి స్పందించి విరాళం పంపిన దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దాతలకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. మానవతా దృక్పథంతో స్పందించారని చెబుతూ... వీల్ చెయిర్ పై వచ్చి, అమెరికా నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఉంటున్న వారిని స్వయంగా పంపించి చెక్కులు అందజేశారని తెలిపారు. స్కూలు పిల్లలు కూడా ఐదు, పది రూపాయలు, కిడ్డీ బ్యాంకులు పగలకొట్టి డబ్బులు తెచ్చిచ్చారని వివరించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. సంఘటితంగా ముందుకు వస్తే విపత్తులను ఎదుర్కోవచ్చని చాటిచెప్పారని దాతలను కొనియాడారు.

వరద బాధితులకు అందజేసినవి..
14 కోట్ల వాటర్ బాటిళ్లు
37 లక్షల మిల్క్ బాటిళ్లు
47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు
5 లక్షల కోడి గుడ్లు
3.50 లక్షల క్యాండిల్స్
2.30 లక్షల మ్యాచ్ బాక్సులు
1.15 కోట్ల ఆహార ప్యాకెట్లు
5 వేల క్వింటాళ్ల కూరగాయలు

దాదాపుగా 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రోడ్లను ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది క్లీన్ చేశారు. 
20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శానిటేషన్ డిపార్ట్ మెంట్ సిబ్బంది తొలగించారు. 

Go Back to Shorts
Chandrababu
Flood Relief
AP Floods
CBN Press Meet
Andhra Pradesh
Vijayawada Floods

More Telugu News