Nara Lokesh: మంత్రి లోకేశ్ పై ఓ నెటిజన్ ఆరోపణలు... ఆధారాలు చూపించాలంటూ ఏపీ పోలీస్ ట్వీట్

AP Police counters a netizen who made allegations on AP minister Nara Lokesh
  • లోకేశ్ పేకాట క్లబ్ ల నుంచి కమీషన్ వసూలు చేస్తున్నాడన్న నెటిజన్
  • విద్యాశాఖ మంత్రిగా ఉండి పేకాటను ప్రోత్సహిస్తున్నాడని విమర్శలు
  • ఆధారాలు చూపించకపోతే విచారణకు సిద్ధంగా ఉండాలన్న ఏపీ పోలీస్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కొత్త ఒరవడి కనిపిస్తోంది. మంత్రులపైనా, కూటమి నేతలపైనా ఎవరైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటే, వెంటనే ఏపీ పోలీస్ విభాగం స్పందిస్తోంది. ఆ ప్రచారాన్ని ఖండించడమో, వివరణ ఇవ్వడమో చేస్తోంది. 

తాజాగా, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై ఓ నెటిజన్ చేసిన ఆరోపణల పట్ల కూడా ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇదేవిధంగా స్పందించింది. ఇంతకీ ఆ నెటిజన్ ఏమని ఆరోపించాడంటే... "సర్కారు వారి పేకాట... రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుంచి వారం వారం కమీషన్లు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి కుమారుడు మంత్రి నారా లోకేశ్ గారు... విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా నారా లోకేశ్ గారూ?" అంటూ ప్రశ్నించాడు. 

దీనికి ఏపీ పోలీసులు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "మీరు ఏపీ మంత్రి నారా లోకేశ్ కు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే దయచేసి మాతో పంచుకోండి... తగిన చర్యలు తీసుకుంటాం. కానీ, ఈ ఆరోపణలు గనుక అవాస్తవం అని తేలితే, ఈ ఆరోపణలతో మంత్రి నారా లోకేశ్ పరువుకు భంగం వాటిల్లితే... దయచేసి మీ వివరాలు అందించండి... తదుపరి విచారణకు సిద్ధంగా ఉండండి" అంటూ ఓ మోస్తరు వార్నింగ్ ఇచ్చింది.
Nara Lokesh
Allegations
AP Police
Social Media
TDP

More Telugu News