Etela Rajender: అందుకే బీజేపీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది: ఈటల రాజేందర్

Etala Rajendhar inspects at Parade Ground for telangana liberation day
  • యోధుల పోరాటంతో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిందన్న ఎంపీ
  • అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్న ఈటల
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల
ఎంతోమంది యోధుల పోరాటంతో నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని, అందుకే బీజేపీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ నాయకులతో కలిసి పరేడ్ మైదానంలో జరుగుతున్న విమోచన దినోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేపు విమోచన దినోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుగా భావించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరారు.

పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, నిజాం పరిపాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం అమరులైన పోరాట యోధుల ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా, తెలంగాణ స్వాతంత్ర్యం కోసం అమరులైన పోరాట యోధుల చరిత్రను తెలంగాణ ఎన్నటికీ మరువదని సంతకాల సేకరణ పట్టికలో పొందుపరిచారు.
Etela Rajender
BJP
Telangana

More Telugu News