తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలకు కోర్టు ఆదేశాలు

Delhi court accepts CM Kejriwal bail bonds issues order for release
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ సమర్పించిన బెయిల్ బాండ్లను రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదించింది. ఆయనను విడుదల చేయాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రెండు పూచీకత్తులతో పాటు రూ.10 లక్షల బెయిల్ బాండ్లను ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నందున... ఈ కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది.

కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. ఇంతకాలం ఆమ్ ఆద్మీ కుటుంబ సభ్యులు గట్టిగా నిలబడ్డారని, అందుకు ధన్యవాదాలు అని కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ వంటి నిజాయతీపరుడు, దేశభక్తి కలిగిన నేత మరొకరు లేరని రుజువైందని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఆయన అరెస్ట్‌కు బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్న వ్యక్తిని జైల్లో పెట్టారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా తాను న్యాయస్థానానికి, రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. 

కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో తమ పార్టీ మరింత పుంజుకుంటుందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా అన్నారు. ఈరోజు ఢిల్లీలో, దేశంలో ఎంతో సంతోషం కనిపిస్తోందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీకి నాయకత్వం వహిస్తారన్నారు.
Go Back to Shorts
Arvind Kejriwal
AAP
Supreme Court
Delhi Liquor Scam

More Telugu News