గుంటూరులో సైనైడ్ హత్యలు... మహిళల గ్యాంగ్ క్రూరత్వం వెలుగులోకి..!
- ముగ్గురు లేడీ కిల్లర్‌లను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు
- నిందితుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి
- డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైనైడ్‌తో సైలెంట్‌గా హత్యలు చేసిన మహిళా గ్యాంగ్
తల్లి, కూతురు ఇద్దరూ చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మించి అప్పుగా డబ్బులు తీసుకుంటారు. డబ్బు తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగిన వారికి కూల్ డ్రింక్ లు, ఆహారం, మత్తు పానీయాల్లో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేస్తారు. ఇటీవల తల్లీకుమార్తెలు ఉంటున్న ఇంటి సమీపంలో ఉండే మునుగప్ప రజినీ కూడా ఈ ముఠాలో చేరింది. ఈ ముగ్గురు మహిళలు అదే ప్రాంతంలో నివాసముండే నాగుల్‌బీని జూన్ నెలలో బయటకు తీసుకొచ్చి చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలో నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి బ్రీజర్ లో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేశారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులకు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మృతురాలు నాగూర్‌బీ, రజని మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, వారు చెప్పిన విషయాలతో పోలీసులే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ముగ్గురూ కలిసి ఇప్పటి వరకూ ముగ్గురు మహిళలు, ఒక పురుషుడికి సైనైడ్ ఇచ్చి హత్య చేసి వారి వద్ద నుండి నగదు, నగలు దోచుకున్నట్లు విచారణలో తేలింది. అంతే కాకుండా మరో ముగ్గురు మహిళలను ఇదే తరహాలో సైనైడ్ కలిపి హత్య చేయడానికి ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో వారు ప్రాణాలతో బయటపడ్డారని ఎస్పీ తెలిపారు.