Gudlavalleru: గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల వ్యవహారంపై ఐజీ కీలక ప్రకటన

The IG declared that the secret cameras in Gudlavalleru Engineering Hostel are unreal
  • హిడెన్ కెమెరాలు, విద్యార్థినుల వీడియోల షేరింగ్‌ ప్రచారంలో నిజం లేదని వెల్లడి
  • హాస్టల్‌లో కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని ప్రకటన
  • కాలేజీలోని సెంట్రల్ సర్వర్‌, హాస్టళ్లు, విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించినట్టు తెలిపిన ఐజీ అశోక్
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రకంపనలు రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఐజీ అశోక్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. హాస్టల్‌లో కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఆయన ప్రకటించారు. హిడెన్ కెమెరాలు, విద్యార్థినుల వీడియోల షేరింగ్‌ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐజీ అశోక్‌కుమార్‌ వివరించారు. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందిని ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవడంతో ఢిల్లీకి చెందిన సీఈఆర్‌టీ (కంప్యూటర్స్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ), పుణెలోని సీ-డాక్‌ టెక్నాలజీ నిపుణుల సాయం కూడా తీసుకున్నామని వివరించారు.

విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నవారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని మూడు రోజులపాటు పరిశీలన, దర్యాప్తు చేశామని ఆయన చెప్పారు. కాలేజీలోని సెంట్రల్ సర్వర్‌తో పాటు హాస్టళ్లను, విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించామని అశోక్ కుమార్ వివరించారు. వివరాలు అన్నింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, 5 రోజుల్లో వివరాలు అందుతాయని ఐజీ పేర్కొన్నారు. సాక్ష్యాలతో ఎవరైనా ముందుకొస్తే దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఎస్పీ గంగాధర్‌‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ సంఘాల వారంతా అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారని, ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని ఐజీ అశోక్ కుమార్ వివరించారు. వారం రోజులపాటు సాగిన దర్యాప్తులో హిడెన్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్‌ జరగలేదని నిర్ధారణ అయిందని అన్నారు. కాగా హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలను అమ్ముకున్నారంటూ ఆగస్టు 29న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు నిరసనకు దిగారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
Gudlavalleru
Gudlavalleru Hidden Cameras
Andhra Pradesh

More Telugu News