Harish Rao: రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్ట్ చేస్తారా?: హరీశ్ రావు

Harish Rao lashes out at farmers over loan waiver
  • రుణమాఫీ కాలేదని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్న హరీశ్ రావు
  • నిరసనలు, ఆందోళనలు చేయవద్దనడం హక్కులను కాలరాయడమేనని మండిపాటు
  • రైతన్నలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్
ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్ట్‌ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

పోలీస్ యాక్ట్ పేరు చెప్పి జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని తమ పార్టీ ఖండిస్తోందనన్నారు.

రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగివేసారి పోతున్నారని విమర్శించారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు.

ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నాడని వ్యాఖ్యానించారు. వ్యవసాయ పనులు చేసుకోవాలా? లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా? అంటూ రైతాంగం కన్నీరు పెట్టుకుంటోందన్నారు. ఏకకాలంలో ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారన్నారు.

కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. "ఎద్దు ఏడ్చిన ఎవుసం... రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేద"న్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ అరెస్టులను నిరసిస్తూ రైతాంగానికి మద్దతుగా బీఆర్ఎస్ కార్యాచరణను ప్రకటిస్తుందని హెచ్చరించారు.
Harish Rao
BRS
Congress
Telangana

More Telugu News