వేధింపులతో మృత్యుముఖంలోకి.. సోదరులకు రాఖీ కట్టాక కన్నుమూసిన యువతి
- మహబూబాబాద్ లో విషాదం.. చూపరులను కంటతడి పెట్టిస్తున్న దారుణం
- ప్రేమ పేరుతో తోటి విద్యార్థి వేధింపులు
- భరించలేక పురుగుల మందు తాగిన యువతి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఓ యువతి కోదాడలో డిప్లొమా చదువుతోంది. కాలేజీలో తనతో పాటే చదువుకుంటున్న ఓ విద్యార్థి ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్నాడు. తనకలాంటి ఉద్దేశమేదీ లేదని, తన వెంట పడొద్దని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన యువతి శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఓవైపు డాక్టర్లు వైద్యం చేస్తుండగా.. సోమవారం రాఖీ పండగ వరకూ ప్రాణాలతో ఉంటానో లేదోనని భావించి కుటుంబ సభ్యులకు చెప్పి రాఖీలు తెప్పించుకుంది. అన్నకు, తమ్ముడికి ఆ రాఖీలను కట్టి కాసేపటికే కన్నుమూసింది. కాగా, యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.