Mamata Banerjee: కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడికి మరణశిక్ష డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్దకు సీఎం మమత ర్యాలీ

Bengal CM Mamata Banerjee to lead march seeking death penalty for accused
  • జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో అట్టుడుకున్న కోల్‌కతా
  • ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
  • రేపు ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు దేశవ్యాప్తంగా అత్యవసర సేవల నిలిపివేత
  • ఆసుపత్రి ధ్వంసం కేసులో 9 మంది అరెస్ట్
జూనియర్ డాక్టర్ హత్యతో కోల్‌కతా అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగానూ దీనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌పై బీజేపీ, సీపీఎం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నేటి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఘటన జరిగిన ఆసుపత్రి వద్దకు ర్యాలీగా వెళ్లనున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలపై ఈ కేసు ఇప్పటికే కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ అయింది. నిందితుడు ప్రస్తుతం దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. 

ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా రేపు (శనివారం) ఉదయం  6 గంటల నుంచి 24 గంటలపాటు దేశవ్యాప్తంగా అత్యవసర సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. 

ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ బుధవారం ఆసుపత్రిని సందర్శించింది. ప్రశ్నించాల్సి ఉందంటూ ఐదుగురు వైద్యులకు సమన్లు ఇచ్చింది. మరోవైపు, ఈ కేసులోని ప్రధాన నిందితుడైన సంజయ్‌రాయ్ భార్య కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అతడు తనపై దాడిచేసినట్టు అందులో పేర్కొంది. కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఎమర్జెన్సీ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించిన కేసులో కోల్‌కతా పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Mamata Banerjee
Kolkata Rape And Murder Case
West Bengal
IMA

More Telugu News