Russia-Ukraine war: రష్యాలోని పట్టణాన్ని ఆక్రమించిన ఉక్రెయిన్

Ukraine troops now in full control of Russian town of Sudzha
  • సుద్జా పట్టణం తమ నియంత్రణలోనే ఉందని ప్రకటన
  • టౌన్ లో మిలటరీ కమాండర్ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు
  • సుద్జాకు 45 కి.మీ. దూరంలోని గ్లుష్కోవ్ వైపుగా కదులుతున్న ఉక్రెయిన్ ఆర్మీ
రష్యా భూభాగంలోకి ఇప్పటికే అడుగుపెట్టిన తమ బలగాలు ప్రస్తుతం ఓ కీలక పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ బలగాలు రష్యా సరిహద్దు దాటి కస్క్ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత సుద్జా టౌన్ ను ఆక్రమించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రష్యన్ టౌన్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు. ఇక్కడ ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెలెన్ స్కీ వివరించారు. ఇది తమకు రష్యా సైనికులపై చెప్పుకోదగ్గ విజయమని తెలిపారు. సుద్జా జనాభా 5 వేల పైచిలుకు ఉంటుందని, ఈ పట్టణం స్వాధీనంలోకి రావడంతో ఇక్కడికి 45 కి.మీ. దూరంలోని గ్లుష్కోవ్ పై ఉక్రెయిన్ బలగాలు కన్నేసినట్లు తెలుస్తోంది.

సుద్జాపై పట్టుకోల్పోయిన తర్వాత రష్యా అప్రమత్తమైంది. ముందుకు వస్తున్న ఉక్రెయిన్ బలగాలను అడ్డుకోవడానికి ఓవైపు చర్యలు చేపడుతూనే గ్లుష్కోవ్ ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయిస్తోంది. ఈమేరకు కస్క్ గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సుద్జా నుంచి ఉక్రెయిన్ బలగాలు ముందుకే వస్తున్నట్లు కస్క్ గవర్నర్ తాజా ఆదేశాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యాలోని బొరిసోగ్లెబ్‌స్క్, సావస్లీకా వైమానిక స్థావరాల్లోని రెండు హ్యాంగర్లు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలతో బయటపడింది.

Russia-Ukraine war
Sudzha
Kursk
Russian Town

More Telugu News