Narendra Modi: బంగ్లా‌దేశ్‌లోని హిందువుల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల్లో ఆందోళన: మోదీ

140 crore Indians worried about safety of Hindus says Modi
  • పొరుగు దేశాల్లో భారత్ శాంతి, సౌభ్రాతృత్వం కోరుకుంటుందన్న ప్రధాని
  • రాబోయే రోజుల్లోనూ బంగ్లాదేశ్‌కు అండగా ఉంటామని హామీ
  • మానవ జాతి సంక్షేమం కోసమే భారత్ పనిచేస్తుందన్న మోదీ
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలనే భారత్ కోరుకుంటుందని తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బంగ్లాదేశ్‌లో వీలైనంత వేగంగా తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్టు మోదీ చెప్పారు. అక్కడి హిందువులు, మైనార్టీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని తెలిపారు. మానవ జాతి సంక్షేమం కోసమే భారత్ ఆలోచిస్తుందని, ఇండియా తన వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌‌కు అండగా ఉంటుందని వివరించారు. 

రిజర్వేషన్ల విషయంలో జూన్ నుంచి బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఇవి ఇటీవల తీవ్ర రూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి ‌భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే రాజకీయ ఆశ్రయం పొందారు. 
Narendra Modi
Bangladesh
Hindus

More Telugu News