Bangladesh: భార‌త ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు రైళ్లు రద్దు...!

India Suspends All Train Services with Bangladesh Amid Spiralling Unrest
  • బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌తో భ‌యంక‌ర ప‌రిస్థితులు 
  • బంగ్లాకు వెళ్లే అన్ని రైళ్ల‌ను నిలిపివేసిన ఇండియ‌న్ రైల్వేస్
  • ఆ దేశంలోని ఎల్ఐసీ ఆఫీసు కూడా మూసివేత
  • ఈ నెల 5 నుంచి 7వ‌ తేదీ వరకూ కర్ఫ్యూ విధించిన బంగ్లా తాత్కాలిక ప్ర‌భుత్వం
బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌తో శాంతిభద్రతలు క్షీణించాయి. ఆ దేశంలోని తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాకు వెళ్లే అన్ని రైళ్ల‌ను నిలిపివేసింది. ఈ మేర‌కు రైలు స‌ర్వీసుల‌న్నీ రద్దు చేసినట్లు భారతీయ రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.  

దాంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అటు పాలన‌ను సైన్యం తన చేతుల్లోకి తీసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. మొద‌ట‌ గుర్తు తెలియని ప్రదేశానికి షేక్ హసీనా తరలి వెళ్లారని వార్తలు వెలువ‌డ్డాయి. ఈ నేపథ్యంలో, అక్కడి పరిస్థితులు ప్రభుత్వ నియంత్రణలో లేవని భావించిన భారత రైల్వే శాఖ బంగ్లాకు వెళ్లే రైలు సర్వీసులను ర‌ద్దు చేసింది.

బంగ్లాలోని ఎల్ఐసీ ఆఫీసు మూసివేత

బంగ్లాదేశ్‌లో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల దృష్ట్యా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఢాకాలోని తన కార్యాల‌యాన్ని మూసివేస్తున్నట్లు ఈ సాయంత్రం ప్రకటించింది. ఆగ‌స్టు ఏడో తేదీ వరకూ బంగ్లాలోని తమ ఆఫీసు మూసేస్తున్నట్లు సోమవారం ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియ‌జేసింది. బంగ్లాదేశ్ లోని తాత్కాలిక‌ ప్ర‌భుత్వం కూడా ఈ నెల 5 నుంచి 7వ‌ తేదీ వరకూ కర్ఫ్యూ విధించింది.
Bangladesh
India
Indian Railways
Train Services

More Telugu News