Jagan: పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు: జగన్

Jagan slams alliance govt in AP
  • ఏపీలో ముఠాల పాలన  కనిపిస్తోందన్న జగన్
  • నంద్యాల జిల్లాలో నిన్న జరిగిన ఘటన, ఎన్టీఆర్ జిల్లా ఘటనే నిదర్శనమని వెల్లడి
  • బాధితులకు అండగా ఉంటామని స్పష్టీకరణ
వైసీపీ అధ్యక్షుడు జగన్ కూటమి ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని విమర్శించారు. ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని తెలిపారు. 

పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదని... ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయని జగన్ ఆరోపించారు. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనం అని పేర్కొన్నారు. 

"ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అందుకే తమను ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని... ప్రజలను, వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల్లో బాధితులుగా ఉన్నవారికి అండగా ఉంటాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం" అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Jagan
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News