USA: మధ్యప్రాచ్యంలో భారీగా యుద్ధ నౌకలు, విమానాలు మోహరిస్తున్న అమెరికా.. తీవ్ర ఉద్రిక్తత

USA will bolster its military presence in the Middle East
  • హమాస్ చీఫ్ హత్యకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక నేపథ్యంలో ఉద్రిక్తతలు
  • ఈ ప్రాంతంలోని పౌరులు, ఇజ్రాయెల్ రక్షణకు అదనపు బలగాలను మోహరించేందుకు అమెరికా నిర్ణయం
  • ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటన
టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య, బీరుట్‌లో హిజ్జుల్లా కమాండర్ వాద్ షుక్ర్‌ హతం నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు ఘటనలు ఇజ్రాయెల్ పనేనని భావిస్తున్న ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంతంలోని తమ సిబ్బందికి, ఇజ్రాయెల్‌కు రక్షణే లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్య ప్రాంతంలో అదనపు యుద్ధనౌకలు, యుద్ధ విమానాలను మోహరించనున్నామని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ శుక్రవారం ప్రకటించింది.

ఇరాన్, దాని భాగస్వాముల హెచ్చరికల కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతల తీవ్రతను తగ్గించేందుకు రక్షణ శాఖ చర్యలు తీసుకుంటుందని పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ అమానవీయ దాడి జరిగిన నాటి నుంచి ఆ దేశ రక్షణతో పాటు ఈ ప్రాంతంలోని తమ సిబ్బంది రక్షణ, ప్రయోజనాలను కాపాడుతున్నామని ప్రస్తావించింది.

కాగా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌తో పాటు ప్రాంతీయ భాగస్వాములు కూడా శపథం చేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. భయానక వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత పౌరులతో పాటు అక్కడికి వెళ్లేవారికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే.
USA
Middle East
Iran
Israel

More Telugu News