Supreme Court: మూఢ నమ్మకాలు, తాంత్రిక విద్యలపై కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేం: సుప్రీంకోర్టు

Supreme Court comments on superstitions and sorcery
  • భారత్ లో ఇప్పటికీ మూఢనమ్మకాలు
  • మూఢ నమ్మకాలను కట్టడి చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ పిల్
  • అది న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం కాదన్న సుప్రీంకోర్టు
  • ప్రజల్లో అక్షరాస్యత పెరిగితే ఇలాంటి సామాజిక రుగ్మతలు ఉండవని స్పష్టీకరణ
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా... మూఢనమ్మకాలు, చేతబడులు, క్షుద్రపూజలు, తాంత్రిక శక్తులు ఇంకా ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

దేశంలో మూఢ నమ్మకాలను, తాంత్రిక విద్యలను కట్టడి చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే ఈ పిల్ పై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం... ఈ విషయంలో తాము కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది. 

"దేశంలో మూఢనమ్మకాలను పారదోలాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు నిజమైన సమాధానం... విద్య. ప్రజల్లో అక్షరాస్యత పెంపొందిస్తే ఇలాంటి సామాజిక రుగ్మతలన్నీ మాయమవుతాయి. 

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పాలి. ప్రజలు బాగా విద్యావంతులు అయినప్పుడు, ప్రజలు మరింత హేతువాదులుగా మారినప్పుడు ఇలాంటి దురాచారాలన్నీ తొలగిపోతాయన్నది ఒక ఆలోచన. అయితే ఇవన్నీ కోర్టులు ఆదేశిస్తే జరిగేవి కావు. మూఢనమ్మకాలను నిర్మూలించండి అని న్యాయ వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలను ఎలా ఆదేశించగలదు? 

కోర్టులను ఆశ్రయించినంత మాత్రాన సంస్కర్తలు కాలేరు. సామాజిక సంస్కర్తలు ఎప్పుడూ కోర్టులను ఆశ్రయించరు. వారు ప్రజల్లోనే ఉంటూ మార్పు కోసం కృషి చేస్తుంటారు. ఓ న్యాయ వ్యవస్థగా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. చట్టం పరిధిలోనే మేం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మూఢ నమ్మకాల నిర్మూలన అనేది చాలా మంచి ఆలోచనే అయినప్పటికీ మేం నిర్ణయం తీసుకోలేం" అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court
Superstitions
Sorcery
PIL

More Telugu News