గాడిద పని గాడిద చేయాలి... కుక్క పని కుక్కనే చేయాలి: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
- 80 వేల పుస్తకాలు చదివానని.. నాకే అంతా తెలుసునని ఎప్పుడూ అనలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా
- ఏ పనిని ఎవడు చేయాలో... వాడే చేయాలన్న ముఖ్యమంత్రి
- మూసీ రివర్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్స్‌ను పిలిచినట్లు వెల్లడి
ఏ పనిని ఎవడు చేయాలో... వాడే చేయాలన్నారు. కానీ కుక్క పని గాడిద చేస్తే నడ్డి విరిగిందన్న సామెతలా ఉంటుందని ఎద్దేవా చేశారు. మనకు తెలియని పని మనం చేస్తే అక్కడ కాలు విరిగినట్లుగా మనకు నడ్డి విరుగుతుందన్నారు. కాబట్టి తాను అలాంటి తప్పులు చేయనని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుమతులు ఇస్తానని... అలాగే తనకు ఏం కావాలో చెబుతానన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్స్
ఎవరు ఎందులో నిష్ణాతులో వారితో ఆ పని చేయిస్తానన్నారు. ఎవరి పని వారు చేసుకుంటారని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెలప్మెంట్పై ఇంతవరకూ ఓ అంచనాకు రాలేదన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిపుణులైన వ్యక్తులను, సంస్థలను నియమిస్తామన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలిచినట్లు తెలిపారు. కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసి ప్రపంచంలో గొప్ప గొప్ప అనుభవజ్ఞులతో కలిసి పని చేసి మూసీ వద్ద దురాక్రమణలు తొలగిస్తామన్నారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ వెంట ఆక్రమణలను తొలగించడంతో పాటు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
మూసీ నాలా వెంట మార్క్ చేసి... భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. అంతర్జాతీయ టెండర్లను పిలిచామని... సాంకేతిక నిపుణుల బృందం వచ్చి ఏం నిర్మించాలి? ఎలా నిర్మించాలి? ఖర్చు ఎంత అవుతుంది? ఇందులో పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తేవాలా లేక గ్రాంట్స్ ఇప్పిస్తారా? అనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఆ తర్వాత అక్కడ ఐటీ కారిడార్ ఉండాలా? ఎంటర్టైన్మెంట్ కారిడార్ నిర్మించాలా? డిస్నీలాండ్ వంటి అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మించాలా? లేక, మూసీ మీద ఫ్లైఓవర్ నిర్మించి చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పించడమా? అనేది కూడా పరిశీలించాల్సి ఉందన్నారు.