Gautam Gambhir: రాహుల్ ద్రావిడ్ నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. గంభీర్ భావోద్వేగం!

Rahul Dravid Message makes Gautam Gambhir emotional bcci shares video
  • టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు రాహుల్ సందేశం
  • కోచ్ బాధ్యతల్లో సవాళ్లు, అనుభవాల గురించి పంచుకున్న వైనం
  • గంభీర్ కోచ్‌గా అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్ష
  • రాహుల్ మెసేజ్‌తో తీవ్ర భావోద్వేగానికి లోనైన గౌతమ్
టీమిండియా హెడ్ కోచ్‌గా తన ప్రయాణం ప్రారంభించిన గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఊహించని సర్‌ ప్రైజ్ ఇచ్చారు. కోచ్ బాధ్యతలో ఎదురయ్యే సవాళ్లు, అనుభవాల గురించి చెబుతూ ఓ ఆడియో సందేశాన్ని షేర్ చేశారు. బీసీసీఐ ఈ మెసేజ్‌‌ను గౌతమ్‌తో పంచుకుంది. రాహుల్ సందేశం విని అతడు తీవ్ర భావోద్వేగానికి లోను కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ నెట్టింట పంచుకుంది. 

మీకో సర్‌ప్రైజ్ అంటూ బీసీసీఐ వారు రాహుల్ సందేశాన్ని గౌతమ్ ముందుంచారు. ‘‘హలో గౌతమ్... ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన జాబ్‌కు నీకు స్వాగతం. టీంతో నా ప్రయాణం ముగిసి మూడు వారాలవుతోంది. కలలో కూడా ఊహించని విధంగా బార్బడాస్ విజయంతో కోచ్ బాధ్యత నుంచి తప్పుకున్నా. ముంబైలో ఆ సాయంత్రం కూడా నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. అన్నిటికంటే మించి ఈ కాలంలో నాకు దొరికిన స్నేహాలు, బంధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నీకు కూడా ఇవి అందాలని కోరుకుంటున్నా. అదృష్టం నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నా’’

‘‘ తోటి ఆటగాడిగా నువ్వు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూశా. బ్యాటింగ్ పార్ట్‌నర్‌గా సహచర ఫీల్డర్‌గా నీ దృఢత్వం, వెనక్క తగ్గని నైజాన్నీ చూశా. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గెలవాలన్న నీ పట్టుదలను, యువ ప్లేయర్లకు సాయపడ్డ వైనాన్ని, ప్రతి క్రీడాకారుడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన వెలికితీయాలన్న తపనను చూశా’’

‘‘ఆటపై నీకున్న అంకిత భావం, ప్రేమ నాకు తెలుసు. ఈ లక్షణాలతో కోచ్‌గా నువ్వు మరింత రాణించాలని కోరుకుంటున్నా. అయితే, మనపై ఎన్ని అంచనాలు ఉంటాయో నీకు తెలియనిది కాదు. కానీ ఎంతటి క్లిష్ట సమయంలో కూడా నీకు ఒంటరితనం ఉండదు. సాటి ప్లేయర్లు, సపోర్టు స్టాఫ్, మాజీ క్రీడాకారులు, మేనేజ్‌మెంట్ నీకు మద్దతుగా ఉంటారు. చివరిగా ఒక మాట.. ఎంత క్లిష్ట సమయంలోనైనా సరే.. చిరునవ్వుతో కనిపించు’’ అని చెప్పుకొచ్చారు. 

కాగా, రాహుల్ ద్రావిడ్ సందేశం విని తాను భావోద్వేగానికి లోనైనట్టు గంభీర్ చెప్పాడు. రాహుల్ తనకు ఆదర్శమని అన్నాడు. తాను చూసిన అత్యంత నిస్వార్థ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్ అని కొనియాడాడు. రాబోయే తరాలు కూడా రాహుల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని అన్నాడు.
Gautam Gambhir
Rahul Dravid
BCCI
Viral Videos

More Telugu News