Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లోని అశోక్, దర్బార్ హాళ్ల పేర్ల మార్పు.. ప్రియాంక గాంధీ విమర్శలు

Durbar Hall will now be called the Ganatantra Mandap and Ashok Hall is now Ashok Mandap
  • దర్బార్ హాల్‌ను ‘గణతంత్ర మండపం’గా మార్పు
  • అశోక్ మండపంగా మారిన అశోక్ హాల్
  • భారతీయ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా పేర్లను మార్చినట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటన
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వివిధ వేడుకలు నిర్వహించే రెండు ముఖ్యమైన హాళ్ల పేర్లు మారాయి. దర్బార్ హాల్‌ పేరును 'గణతంత్ర మండపం'గా, అశోక్ హాల్‌ను 'అశోక్ మండపం'గా మార్చుతున్నట్టు రాష్ట్రపతి సెక్రటేరియెట్ ప్రకటించింది. భారతీయ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా పేర్లను మార్చుతున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించారని వెల్లడించింది. భారత రాష్ట్రపతి కార్యాలయం, నివాసమైన ‘రాష్ట్రపతి భవన్’ దేశానికి ప్రతీక అని, దీనిని ప్రజలకు మరింత అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామని వివరించింది.

కాగా జాతీయ అవార్డులతో పాటు పలు ముఖ్యమైన వేడుకలను ‘దర్బార్ హాల్’లోనే నిర్వహిస్తుంటారు. 'దర్బార్' అనే పదం నాటి రాజులు, బ్రిటిష్ కాలం నాటి న్యాయస్థానాలు, సమావేశాలను ప్రతిబింబిస్తోంది. దేశం గణతంత్రంగా మారిన తర్వాత ఈ పదానికి ఔచిత్యం లేకుండా పోయింది. అందుకే దర్బార్ పదానికి బదులుగా 'గణతంత్ర మండపం'గా రాష్ట్రపతి భవన్ పేరు మార్చింది.

ఇక ‘అశోక్ హాల్’ను బ్రిటీష్ కాలంలో ‘బాల్‌రూమ్’గా ఉపయోగించేవారు. అంటే చాలా పెద్దగా ఉండే ఈ రూమ్‌లో పార్టీలు నిర్వహించేవారు. 'అశోక్' అనే పదం ‘అన్ని బాధల నుంచి విముక్తి’ లేదా ‘ఏ దుఃఖమూ లేదు’ అనే అర్థానిస్తుంది. అదేవిధంగా అశోక్ చక్రవర్తి చాటిచెప్పిన ఐక్యత, శాంతియుత సహజీవనానికి కూడా సంకేతంగా ఉంది. అయితే ‘అశోక్ హాల్' పేరులో హాల్ అనే పదం ఇంగ్లీష్‌లో ఉంది. భాషలో ఏకరూపతను సూచించేలా ఇంగ్లీష్ ఆనవాళ్లు లేకుండా ’అశోక మండపం’ అని పేరు మార్చుతున్నట్టు రాష్ట్రపతి భవన్ వివరించింది.

పేర్లు మార్చుతూ రాష్ట్రపతి భవన్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తప్పుబట్టారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం 'దర్బార్' అనే భావన లేదు, కానీ చక్రవర్తి అనే భావన నేటికీ ఉందని మండిపడ్డారు. కాగా నిరుడు ‘మొఘల్ గార్డెన్స్‌’గా పేరుగాంచిన రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ పేరును 'అమృత్ ఉద్యాన్'గా ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే.
Rashtrapati Bhavan
Durbar Hall
Ganatantra Mandap
Ashok Hall
Ashok Mandap

More Telugu News