Revanth Reddy: కేంద్రమంత్రిని కలిసి నిధులు కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy meets Union Minister
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను సోమవారం సాయంత్రం సీఎం, మంత్రులు కలిశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. కాలుష్యం బారినపడి మురికికూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా వివరించారు.

రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపడానికి రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తుచేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి జోషి ప్రహ్లాద్‌ను కలిశారు.

సోనియా గాంధీ నివాసానికి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
BJP

More Telugu News