KCR: అధికారం పోయిందని బాధపడటం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదు: కేసీఆర్

KCR on brs defeat in assembly and lok sabha polls
  • ప్రజాస్వామ్యంలో అధికారం లేదా ప్రతిపక్ష పాత్ర శాశ్వతం కావన్న కేసీఆర్
  • మనకు ప్రజాతీర్పే శిరోధార్యమని... వారు ఏ పాత్రను అప్పగిస్తే దానిని నిర్వర్తించాలని వ్యాఖ్య
  • రాజకీయానికి గెలుపోటములతో సంబంధం లేదన్న కేసీఆర్
అధికారం కోల్పోయామని బాధపడటం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం లేదా ప్రతిపక్ష పాత్ర శాశ్వతం కాదన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఆయన ఫామ్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మనకు ప్రజా తీర్పే శిరోధార్యమన్నారు. వారు ఏ పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలన్నారు.

ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం అన్నారు. దానికి గెలుపోటములతో సంబంధం ఉండదని హితబోధ చేశారు. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలమీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోందని అవేదన వ్యక్తం చేశారు.

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమన్నారు. అన్నివర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను బాగు చేస్తున్న మన పాలన పోతుందని ఎవరూ అనుకోలేదన్నారు. జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతోందన్నారు. ఎన్నికల ఫలితాలతో దేశ రైతాంగం బాధపడిందన్నారు. కేసీఆర్ పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందన్నారు.
KCR
BRS
Telangana

More Telugu News