Telangana: ప్రభుత్వ వెబ్‌సైట్లలో ముఖ్యమైన కంటెంట్ అదృశ్యం: సీఎస్‌కు కేటీఆర్ ఫిర్యాదు

KTR request Telangana CS urgent intervention regarding digital vandalism of Telangana

  • తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ శాంతికుమారికి విజ్ఞప్తి
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమైన సమాచారం కనిపించకుండా చేశారని ఆరోపణ
  • ఉద్దేశపూర్వకంగా సమాచారం కనిపించకుండా చేశారని అనుమానం
  • కేసీఆర్ పాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, సమాచారాన్ని తొలగించారన్న కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

2023 డిసెంబ‌ర్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తెలంగాణ ప్ర‌భుత్వ వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లోని ముఖ్య‌మైన స‌మాచారాన్ని క‌నిపించ‌కుండా చేశారని పేర్కొన్నారు. కొన్ని ముఖ్య‌మైన వెబ్‌సైట్ల‌ను పూర్తిగా తొల‌గించారన్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ఆ ప్ర‌ముఖ సైట్ల‌ను ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంచినట్లు తెలిపారు. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే చేసిన‌ట్లుగా కనిపిస్తోందన్నారు.

ఈ వెబ్‌సైట్ల నుంచి ముఖ్య‌మైన స‌మాచారం అదృశ్యం కావ‌డం, కొన్ని వెబ్‌సైట్లు మాయం కావ‌డం వెనుక పాల‌కుల‌ హ‌స్తం ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబ‌ర్ వ‌ర‌కు కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారని... కేసీఆర్ ప‌రిపాల‌న‌కు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, ముఖ్య‌మైన స‌మాచారాన్ని వెబ్‌సైట్ల‌తో పాటు సోష‌ల్ మీడియా ఖాతాల్లో నుంచి తొలగించారని తెలిపారు.

ముఖ్య‌మైన కంటెంట్‌ను ఆర్కైవ్స్‌లో భ‌ద్ర‌ప‌ర‌చాలని... కానీ ఇలా తొల‌గించ‌డం సరికాదన్నారు. ఈ విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భవిష్యత్తు తరాలు క్షమించవన్నారు. కాబ‌ట్టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌క్ష‌ణ‌మే స్పందించి, ఈ విలువైన స‌మాచారాన్ని కాపాడే బాధ్య‌త తీసుకోవాలన్నారు. ఏయే వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియా ఖాతాలు తొల‌గించారనే వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మీకు పంపిస్తానని తెలిపారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News