Pawan Kalyan: ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలవ్వాలి: కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

Pawan Kalyan held review meeting at Kakinada district collectorate
  • ఏపీలో 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్
  • ఓ బాలిక జమ్మూలో ఉన్నట్టు తెలిసిందన్న పవన్ కల్యాణ్
  • అదృశ్యమై 24 గంటలు గడిస్తే ఆ అమ్మాయి విషయం మర్చిపోవాల్సిందేనని వెల్లడి
  • పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటారని వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఓ బాలిక జమ్మూలో ఉన్నట్టు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్ తో ఆ అమ్మాయిని అపహరించినట్టు తెలిసిందని వివరించారు. 

 బాలిక తల్లి తనను కలిసి భోరున విలపించిందని, తాను మాచవరం సీఐకి ఈ విషయం తెలియజేస్తే... వారు వెంటనే స్పందించి అద్భుతమైన రీతిలో పనితీరు కనబరిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు. కొద్ది సమయంలోనే బాలిక ఆచూకీ తెలుసుకున్నారని వెల్లడించారు. 

ఇదే రీతిలో మిగతా కేసులను కూడా తీవ్రంగా పరిగణించి అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు. ఈ వ్యవహారంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్రరూపం దాల్చదని అన్నారు. 

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓ అమ్మాయి అదృశ్యమై 24 గంటలు గడిస్తే, ఆ అమ్మాయి దొరకడం చాలా కష్టమని, ఆ అమ్మాయి సంగతి ఇక మర్చిపోవడమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక, 48 గంటలు గడిస్తే ఆ అమ్మాయిని ఎటు తీసుకెళతారో తెలియదు... బెంగళూరు తీసుకెళతారో, ఇంకెక్కడికి తీసుకెళతారో తెలియదు... ఇలాంటి విషయాల్లో పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటారని వివరించారు. 

అయితే, ఏపీ పోలీసులను మాత్రం ఈ విషయంలో అభినందించాలని, ఓ అమ్మాయి అదృశ్యమైన 9 నెలల తర్వాత కూడా ఆచూకీ తెలుసుకోగలిగారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. హేట్సాఫ్ టు ఏపీ పోలీస్ అని వ్యాఖ్యానించారు. 

ఇంతమంది ఆడపిల్లలు రాష్ట్రంలో అదృశ్యమైపోతే దీనిపై ఎందుకు స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయకూడదు అనే అంశాన్ని రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. పోలీసు అధికారులతో మాట్లాడి దీనిపై ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తామని చెప్పారు.
Pawan Kalyan
Review
Kakinada
Janasena
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News