రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిరిగిన టెంట్... నెహ్రూని నిందించవద్దంటూ బీజేపీ సెటైర్

BJP on Rajkot canopy collapse
  • రాజ్‌కోట్ విమానాశ్రయంలో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ చినిగి కూలిన వైనం
  • ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
  • అక్కడ క్లాత్ టెంట్ మాత్రమే చిరిగిందని... కట్టడం కూలినట్లు కాదన్న బీజేపీ నేత
  • నెహ్రూ ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలు నిర్మించలేదని ఎద్దేవా
గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్ కొంతభాగం చిరిగి కిందపడిపోయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అయితే, ఇందుకు 'నెహ్రూను నిందించవద్దంటూ' బీజేపీ చురక అంటించింది. గుజరాత్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజ్‌కోట్ విమానాశ్రయంలో నీరు నిలవకుండా ఉండేందుకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో టెర్మినల్ వెలుపల ప్రయాణికుల రాకపోకల కోసం టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ టెంట్ కొంతభాగం చిరిగి... వర్షానికి కిందపడిపోయింది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ గత ఏడాదే ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని విమర్శలు గుప్పించారు.

అయితే, బీజేపీ దీటుగా స్పందించింది. ఆ పార్టీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్ కోట్ విమానాశ్రయంలోని క్లాత్ టెంట్ చిరిగిపోయిందని... అంతేకానీ, కట్టడం కూలినట్లు కాదన్నారు. అయితే, ఈ ఘటనకు మాజీ ప్రధాని నెహ్రూను నిందించవద్దని సెటైర్ వేశారు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదన్నారు. ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించామని చురక అంటించారు.
Go Back to Shorts
BJP
Congress
Gujarat
Nehru

More Telugu News