Rahul Gandhi: నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి: రాహుల్ గాంధీ

Rahul Gandhi Muted Mic Charge Gets Rejoinder From Speaker
  • కేంద్ర ప్రభుత్వంతో శాంతియుతంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
  • నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసునని వ్యాఖ్య
  • విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు వేలకోట్లు సంపాదించారని ఆరోపణ
నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై ప్రభుత్వంతో నిర్మాణాత్మకమైన చర్చ జరగాలని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతియుతంగా చర్చించడానికి విపక్ష నేతలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈరోజు లోక్ సభలో నీట్ విషయం మాట్లాడుతుండగా తన మైక్‌ను కట్ చేశారని పేర్కొన్నారు. 

నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసునని... విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేలకోట్ల రూపాయలు సంపాదించారన్నారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారన్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడం వారి కల అన్నారు. గురువారం విపక్షాల సమావేశంలో ఈ విషయం గురించి చర్చించినట్లు చెప్పారు. విద్యార్థుల సమస్యపై వారి తరఫున పోరాడాలని నిర్ణయించామన్నారు.

గత ఏడేళ్లలో వివిధ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని విమర్శించారు. దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే అవినీతి జరిగిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దీనికి పరిష్కారం చూపాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రధానిని కోరుతున్నప్పటికీ ఆయన మౌనం వీడటం లేదన్నారు.
Rahul Gandhi
Congress

More Telugu News