Consumer Forum: ప్రయాణంలో బ్యాగు చోరీ.. రైల్వే నుంచి రూ. లక్ష పరిహారం

Consumer court directs Indian Railways to pay over Rs 1 lakh to passenger
  • సేవాలోపమేనని తేల్చి పరిహారం ఇవ్వాలంటూ వినియోగదారుల కమిషన్ తీర్పు
  • ప్రయాణికురాలి నిర్లక్ష్యమే కారణమంటూ రైల్వే శాఖ వాదన
  • 2016 నాటి కేసులో తాజాగా తీర్పు వెలువరించిన కమిషన్
రైలు ప్రయాణంలో బ్యాగును పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలికి రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. రైల్వే శాఖ సేవల్లో నిర్లక్ష్యం ఉందని పేర్కొంటూ బాధిత ప్రయాణికురాలికి రూ.1.08 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2016 లో జరిగిన చోరీ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది. పరిహారం మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత జనరల్ మేనేజర్ ను ఆదేశించింది.

ఏంటీ కేసు..
2016లో ఢిల్లీకి చెందిన ఓ మహిళ మాల్వా ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి ఇండోర్ కు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తన వెంట తీసుకెళ్లిన విలువైన బ్యాగు చోరీకి గురైంది. ఝాన్సీ, గ్వాలియర్ స్టేషన్ల మధ్య ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించిన మహిళ.. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ.80 వేల విలువైన వస్తువులు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది సేవా లోపం కిందికే వస్తుందని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని సదరు ప్రయాణికురాలు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ప్రయాణికులు వారి లగేజీ బాధ్యత రైల్వేదేనని కమిషన్ ముందు తన వాదన వినిపించింది.

అయితే, ప్రయాణ సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్లే బ్యాగు చోరీకి గురైందని, లగేజీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి బుకింగ్‌ చేసుకోలేదని రైల్వేశాఖ వాదించింది. ఇరువురి వాదనలు విన్న కమిషన్.. రైల్వే శాఖ వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో రైల్వే శాఖ నిర్లక్ష్యం, సేవా లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. బ్యాగు చోరీ జరగడంతో ప్రయాణికురాలు పడిన ఇబ్బందిని పరిగణనలోకి తీసుకుంటూ ఆమె కోల్పోయిన రూ.80 లతో పాటు పరిహారంగా రూ.20 వేలు, న్యాయప్రక్రియ ఖర్చుల కింద రూ.8 వేలు.. మొత్తంగా రూ.1.08 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
Consumer Forum
Indian Railways
Exgratia
Bag loss
passenger luggage

More Telugu News