Crime News: ‘కూతురి మిస్సింగ్’పై సౌదీ నుంచి పోలీసులకు తండ్రి ఫిర్యాదు.. దర్యాప్తులో షాకింగ్ నిజం

A woman had buried her daughter 10 months ago in the Faridabad house they were living in
  • ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి
  • తండ్రి ఫిర్యాదుతో 10 నెలల తర్వాత వెలుగులోకి
  • ఫరీదాబాద్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
భార్యతో విభేదాల నేపథ్యంలో దాదాపు 10 నెలలుగా కన్నకూతురి జాడ తెలియకపోవడంతో ఓ తండ్రికి అనుమానం వచ్చింది. సౌదీ అరేబియాలో ఉంటున్న అతడు అక్కడి నుంచే ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్యాప్తులో ఆ వ్యక్తి కూతురు చనిపోయిందని గుర్తించారు. సొంత ఇంట్లోనే ఆమెను పాతిపెట్టారని కనుగొన్నారు. పాతి పెట్టింది కూడా కన్నతల్లేనని తేల్చారు.

ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి అనుకొని ఉండే ఫరీదాబాద్‌లో వెలుగు చూసింది. ఘటన జరిగిన 10 నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రంగంలోకి దిగారు. ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. దర్యాప్తు క్రమంలో ఇంట్లోనే పాతి పెట్టిన శవాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

మృతురాలి పేరు పర్వీనా అని, ఆమెకు 17 ఏళ్లని పోలీసులు వెల్లడించారు. తల్లి అనితా బేగంను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. జూన్ 7న తమకు ఈ-మెయిల్ ఫిర్యాదు వచ్చిందని, ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై ప్రశ్నించగా తన భార్యతో సత్సంబంధాలు లేవని అతడు చెప్పాడని వివరించారు. 

కాగా పర్వీనాను తాను హత్య చేయలేదని తల్లి అనితా బేగం చెబుతోంది. పర్వీనా ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పింది. అయితే ఇంట్లో పాతిపెట్టింది తానేనని ఆమె అంగీకరించింది. పర్వీనాకు అఫైర్స్ ఉండేవని, ఇంటి నుంచి పారిపోతుండేదని, ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉంచానని, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. ఇక కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే భయంతో ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు వివరించింది.

చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఆమెను ఇంట్లోనే పాతిపెట్టడం తాను చేసిన పెద్ద తప్పు అని అనితా బేగం పేర్కొంది. కాగా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి విచారణ మొదలు పెడతామని పోలీసులు తెలిపారు.
Crime News
Faridabad
India

More Telugu News