Kandula Durgesh: 'విశ్వంభర' సెట్స్ పై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి స్వాగతం పలికిన చిరంజీవి

Chiranjeevi welcomes AP Cinematography minister Kandula Durgesh on Vishwambhara sets
  • జనసేన తరఫున నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేశ్
  • ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా నియామకం
  • సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో 'విశ్వంభర' సెట్స్ సందర్శన
  • చిరంజీవి, ఇతర యూనిట్ సభ్యులతో భేటీ
నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కందుల దుర్గేశ్ ను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ ను సందర్శించారు. చిరంజీవి తదితరులతో మాట్లాడారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

మిత్రుడు కందుల దుర్గేశ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంభర సెట్స్ పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయనకు నా శుభాకాంక్షలు. 

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. ఆయన సానుకూల స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

అలాగే, పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పర్యాటక స్థలాలను పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మంత్రి కందుల దుర్గేశ్ విశ్వంభర సెట్స్ పై గడిపిన తాలూకు ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.
Kandula Durgesh
AP Minister
Cinematography
Chiranjeevi
Vishwambhara
Tollywood

More Telugu News