Kinjarapu Atchannaidu: పసుపు బిళ్ల తీసుకెళ్లినా పనులు కాకపోతే అప్పుడు నేను రంగంలోకి దిగుతా: అధికారుల‌కు అచ్చెన్నాయుడు వార్నింగ్‌

Minister Kinjarapu Atchannaidu Sensational Comments
  • పసుపు బిళ్ల తీసుకెళ్తే చాలు పనులైపోతాయంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌
  • అలా వెళ్లిన వారికి కుర్చీ వేసి, టీ ఇచ్చి.. ఏ పని కావాలో అధికారులు చేసి పెడతారన్న మంత్రి
  • ఆయ‌న చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు. అలా పసుపు బిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి, టీ ఇచ్చి.. వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలిస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు. పసుపు బిళ్ల తీసుకెళ్తే పనులైపోతాయంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

పసుపు బిళ్ల తీసుకెళ్లినా కూడా పనులు కాకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతానని కూడా ఆయన చెప్పారు. తన మాట వినని ఒక‌రో ఇద్ద‌రో అధికారులు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారాయన. ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు అవస్థలు పడ్డారని, అవమాన పడ్డారని గుర్తు చేశారు. ఇకపై ఎస్సై దగ్గరికి వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా, ఎంపీడీవో దగ్గరకు వెళ్లినా టీడీపీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే తీవ్ర విమర్శలు వినపడుతున్న త‌రుణంలో అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.
Kinjarapu Atchannaidu
TDP
Andhra Pradesh
Sensational Comments

More Telugu News