Ramoji Rao: కఠిన క్రమశిక్షణ పాటించిన రామోజీరావుకు సూర్యుడే ఆదర్శం: 'ఈనాడు' ఎడిటర్ ఎం నాగేశ్వర రావు

Senior Journalist M Nageswara Rao said that Sun is the role model for Ramoji Rao
  • క్రమణశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారన్న ఈనాడు ఏపీ ఎడిటర్
  • ఆయన జీవితం నుంచి చాలా నేర్చుకోవచ్చని ప్రశంసలు
  • ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన రామోజీరావు సంతాప కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు
విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు అని, క్రమశిక్షణకు మారుపేరు ఆయన అని ఈనాడు దినపత్రిక ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు (ఎమ్మెన్నార్) అభివర్ణించారు. రామోజీరావు చురుకైన, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేవారని అన్నారు. ఉదయం 4 గంటలకే దినచర్య ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఏ పనిని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేస్తూ క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న రామోజీరావుకు సూర్యుడే ఆదర్శమని నాగేశ్వరరావు తెలిపారు. రామోజీరావు నాస్తికులే అయినప్పటికీ సూర్యుడిని బాగా ఆరాధిస్తారని వెల్లడించారు. 

రామోజీ ఒక సాహసి, ఒక ధైర్యశాలి అని నాగేశ్వరరావు కొనియాడారు. తెలుగును ప్రేమించి, అభిమానించి, పోషించిన వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు. ఒక్కొక్కసారి ఆయన జీవితాన్ని చూస్తుంటే బాధగా అనిపిస్తుందని, ఎందుకంటే జీవితంలో ఆయనకు వేరే వ్యాపకం ఏదీ లేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆరోగ్యం కోసం ప్రతి రోజూ ఆయన తప్పనిసరిగా వాకింగ్ చేస్తుండేవారని చెప్పారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడారు.

39 సంవత్సరాల పాటు ఛైర్మన్‌ రామోజీరావుతో కలిసి ప్రయాణించానని, విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు అని ఆయన అన్నారు. ఆయన జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని పాటించినా మనం మంచి విజయాలు సాధించవచ్చని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ప్రొడక్షన్ కేంద్రాన్ని నిర్మించారని, తెలుగువారికి ఖ్యాతి తెచ్చిపెట్టారని కొనియాడారు.

కాగా సంతాప కార్యక్రమంలో ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్‌ ప్రసాద్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ  తదితరులు హాజరయ్యారు. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Ramoji Rao
M Nageswara Rao
Eenadu Group
Ramoji Groups
Andhra Pradesh
Telangana

More Telugu News